ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌..

 ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటివరకు 54.65 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా తెలిపింది. 6 గంటల తర్వాత కూడా క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఈసీ తెలిపింది. కాసేపట్లో పోలింగ్‌ శాతాన్ని మీడియాకు వెల్లడించనున్నట్లు ఈసీ తెలిపింది. సాయంత్రం 5.30 గంటల వరకు 53 శాతం పోలింగ్‌ నమోదవగా.. 6 గంటల సమయానికి 54.65 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఈసీ ప్రకటించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 672 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 28 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. పటేల్‌ నగర్‌లో అత్యల్పంగా నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో 391 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి. కాగా, 2015లో జరిగిన ఎన్నికల్లో 67 శాతం పోలింగ్‌ నమోదయింది. ఆ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. బీజేపీ 3 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు.